Visurrayi
Editor · New Arrivals

Price: Rs. 180. మహిళలలో ఆత్మగౌరవ చైతన్యాన్ని ప్రోది చేసే కథల సమాహారం ఇది. మూడు దశాబ్దాల కిందట ఆడవాళ్ళ బతుకు తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ఈ 'విసుర్రాయి’ కథలు చెబుతాయి. ప్రత్యేకించి తెలంగాణ పల్లె, పట్నం, నగరాల్లోని మహిళల జీవితాల్లోని విభిన్న పార్శ్వాలను ముదిగంటి సుజాతారెడ్డి చిత్రించారు. ఆమె జీవితానుభవం విస్తృతమైంది. తన అనుభవ పరిధిలోంచి చూసిన జీవితం తాలూకు వైశాల్యాన్ని, వైరుధ్యాలను ఈ కథలలో ప్రతిఫలించారు. విభిన్న తరాల మహిళల మనస్తత్వాలకు చిత్రిక పట్టారు. ఒత్తిడిని అధిగమించి తమను తాము కూడదీసుకుని ఆత్మగౌరవంతో జీవించేందుకు మహిళలు పడే తపనను ప్రతిఫలించారు. పితృస్వామ్య వ్యవస్థ పీడనను ఎదిరించి తమను తాము గెలుచుకునేందుకు తపించిన పాత్రలు ఈ తరం పాఠకులకు ఆత్మస్థయిర్యాన్నిస్తాయి. అందుకోసం ఈ కథలు ఆవశ్యం, పఠనీయం. కుటుంబం, పెళ్ళి లాంటి వ్యవస్థలను తిరస్కరించరు రచయిత్రి. వాటిలో ప్రజాస్వామిక మార్పులు రావాలని ఆశిస్తారు. ఈ ఆకాంక్షను అభివ్యక్తం చేసే పాత్రలు మహిళలకు ధైర్యాన్నిస్తాయి. స్త్రీల మనోభావాలను అర్థం చేసుకునే హృదయ సంస్కారాన్ని మగవారి లో ప్రోది చేస్తాయి. ఇదే ఈ కథల సాఫల్యం, అంతేగాక 1990ల కాలంలో నెలకొన్న ఉదారవాద ఆర్థిక విధానాల ప్రభావం సామాజిక జీవితం మీద చూపిన ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కథలు తోడ్పడతాయి. ఇతివృత్తంలో వైవిధ్యం, సరళమైన కథనరీతి, తెలంగాణ మాండలిక సోబగులు ఈ కథలకు అదనపు అందాన్ని ఇచ్చాయి. తెలంగాణ కథా సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన 'విసుర్రాయి'ని చదవడం ఈ తరం పాఠకులకు సరికొత్త అనుభవం.