Virat
పొనుగోటి కృష్ణారెడ్డి / Ponugoti Krishna Reddy. · Novels

Price: Rs. 45. అతి చిన్న, కేవలం 48 పేజీల నవలిక అనంతమయిన గాంభీర్య భావాలను, యుక్తాయుక్త ధర్మాల మీమాంసను, జీవనగమనంలో ఎదురయ్యే సవాళ్ళను సమాధానంలేని విచిత్ర పరిస్థితులను నింపుకున్న పెద్దబాలశిక్షలాంటి అతిగొప్ప పుస్తకంగా నన్ను తాకి, మనసంతా తీవ్ర సంఘాతానికి గురిచేసింది. 'ఒక అక్షరం వేయి మెదళ్ళకు కదలిక' అని విన్నాం - చదివాం ! కాని దాని తాలుకు ప్రభావం ఎంతమోతాదులో వుంటుందన్న విషయం నా స్వల్ప మేధకు తోచలేదు, యీ పుస్తకం చదివేంతవరకు. ఎన్నో పుస్తకాలు చదివినా వాటిల్లో ఏ ఒకటో అరో వాటి తాలూకు భావవీచికలు వెంటాడుతాయి. ఒకస్థాయిలో వేటాడుతాయికూడా. అదీ కొంత కాలం వరకే! కాని 'విరాట్' నన్ను కనీసం ఒక సంవత్సరం పాటు మామూలు మనిషిని కానివ్వలేదు, వెంటాడింది, వేటాడింది. అదొక మనోవిస్ఫోటనం కలిగించింది. అంతరంగంలో తెలియని అలల సుడులు తిరిగి నాకున్న అంతంత మాత్రం ప్రశాంతతను భగ్నంచేసింది. నిజాయితీగా చెప్పాలంటే, నాలో ఒక రకమైన అపరాధ భావం రేకెత్తించి, నేను గతంలో ఇతరుల ప్రవర్తనావళి మీద ఏర్పరచుకున్న ఏకపక్ష అభిప్రాయాల్ని గురించి, తత్కారణంగా వారి పట్ల నా వైఖరి గురించి, నా స్పందనల గురించి, ఇలా ఎన్నో, ఎన్నెన్నో నా నిర్ణయ పద్దతుల మీద తీవ్రమైన పశ్నార్థకాలు మొదలయ్యాయి. నన్ను నేను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరముందేమోనని అనిపించింది.