THARAGATHI

Editor · Education & Science

THARAGATHI book cover

Price: Rs. 45. రామయ్యే ఓ తరగతి గది ఈ వ్యాసాలన్నీ ఎక్కడో ఇంట్లో మూలన కుర్చీలో కూర్చొని రాసినవి కావు. పోనీ ప్రశాంత వాతావరణంలో మర్ధనలు చేసినవి అంతకన్నా కావు. ఇవన్నీ చాలా వాడిలో, వేడిలో, ఉత్కంఠలో రాసినవి. ఎన్నికలంటే తమాషాలు కావని అందరికీ తెలిసినవే. అలాంటి ఎన్నికల బరిలోకి ఒక విద్యావేత్త, ఒక నిజాయితీపరుడు దిగితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఓ సంకట పరిస్థితిని మన విద్యావేత్త ఐఐటి రామయ్య ఎదుర్కొన్నారు. 2007లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉమ్మడి ఉపాధ్యాయ ఉద్యమ అభ్యర్థిగా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇది ఈ శతాబ్ద ఆరంభంలో ఒక ఆశ్చర్యం కావొచ్చు. అది వేరే విషయం. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఈ ఎన్నికల సందర్భంలో కూడా రామయ్య తన రాతల్ని మరువలేదు. తన కలాన్నీ ఆపలేదు. ఒక పక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి స్కూలుకు తిరుగుతూ మరో పక్క విద్యా వ్యాసాలను కూడా రాశారు. ప్రతి నిత్యం విద్యా సంబంధమైన మార్పుల్ని ఆయన గమనించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలపై ఆయన దృష్టి పెట్టారు. ఎన్నికల సమయంలో తనకు ఎదురైన ప్రశ్నలకు చికాకు పడకుండా సమాధానం చెపుతూనే ఇంకో పక్క ఈ రచనా వ్యాసంగాన్ని ఆయన కొనసాగించారు. ఏ పనికైనా నిబద్ధత ఉండాలి. నిబద్దత, నిమగ్నతల మూర్తిత్వమే రామయ్య. అందుకే తాను నిమగ్నతతో రాసిన వ్యాసాలు ప్రభుత్వాన్ని ఆలోచింపచేశాయి. కాన్సెప్ట్ బడులు మనకు తగవని రామయ్య వాదన చేయడంతో ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి పోయింది. ఈ పుస్తకంలో ప్రాథమిక విద్య, ఉన్నతవిద్య, సాంకేతిక విద్యలకు సంబంధించిన వర్తమాన అంశాలు అనేకం ఉన్నాయి. ఈ పుస్తకం ఉపాధ్యాయ, అధ్యాపకులకు, విద్యార్థులకు, ఆలోచనాపరులకు ఎంతో ఉపకరిస్తుంది. ఆంధ్రదేశ విద్యారంగంపై చుక్కా రామయ్య నిరంతరంగా రాస్తున్న అనేక వ్యాసాల పరంపరలో 'తరగతి' సంకలనం ఒకటి. ఇది విద్యారంగానికి ఎంతో ఉపకరిస్తుంది. రామయ్య సూచనలు విద్యారంగానికి మేలుకొల్పులు.

Browse more Telugu books