swetcha geetham
Editor · Stories & Poetry

Price: Rs. 180. ఎంతో నిబద్ధత ఉంటే తప్ప, కీర్తి ప్రతిష్ఠల వెంటబడకుండా, పీడిత ప్రజల వెంట బతికే పోరాటంగా గడపటం ద్వారానే, ఆ కీర్తి ప్రతిష్ఠలు మన వెంటపడతాయని నిరూపించిన సిసలైన ప్రజాకవి సాంబరాజు యాదగిరి, యదార్థాలను పరిశీలించాడు... పరిశోధించాడు... పరీక్షించాడు... పరిరక్షించాడు. అది చాలు యాదగిరి జీవితానికి, - దేవేంద్ర జీవితంనేర్పిన పాఠాలు బతుకుమార్గం చూపెడుతుంటే, బతకడానికి పోరాటం అనివార్యం అయినప్పుడు, శాస్త్రం మదిలుండాల్సిందే... శస్త్రం చేతులుండాల్సిందే!! అట్లా మార్క్సిజం ఒక చేతిలో... పాట ఇంకో చేతిలో ఎత్తిపట్టుకున్న రాగాల బాటసారి... ఉద్యమాల రాదారి... మా సాంబన్న. - స్పూర్తి చైతన్యం రగిలించటంలో పాట తూటాకన్నా గొప్పదని, పెద్దలు పాట ప్రాధాన్యతను చెప్పారు. పాటలు పాడుతూ, పాట రచనలోనూ తనదైన శైలితో వాగ్గేయకారునిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కళారంగంలో సాంబరాజు యాదగిరిగారు "సాంబరాజు" పేరుతో సుపరిచితుడు. - డా|| గోపాల్‌రెడ్డి మనిషి ఎంత సరళమో మాటా అంతే సరళం. ఎంతటి సంక్లిష్టతనైనా తనదైన సరళత్వంతో ఛేదించే సహజశైలి. ఆ శైలే అతని కలానికీ గళానికీ ఎనలేని బలం. అందుకే యాదగిరన్న పాట ప్రజల పరమయ్యింది.. ప్రజా నాట్యమండలి స్వరమయ్యింది. తెలంగాణ మట్టి వాసనలు వెదజల్లే పదబంధాలు, మనుషుల అనుబంధాల కలబోతగా సాగే ఆయన పాట.. ఆత్మీయులతో సంభాషిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కష్టసుఖాలను కాచివడబోసిన అనుభవాల సారంగా సాగే ఆయన మాట.. ఓ జీవనగీతంలా వినిపిస్తుంది. కాబట్టే అతను కవిగాయక సంగమంగా రూపుదిద్దుకున్నాడు. - రాంపల్లి రమేష్