Sumathi-Vemana Neethi Padyalu
పి. రాజేశ్వరరావు / P. Rajeshwara Rao · Literature

Price: Rs. 45. బద్దెన (1260 ప్రాంతం) తెలుగు ప్రజల నాలుకల మీద చిరకాలంగా నానుతూ తెలుగువారి అంతశ్చేతనలో భాగంగా కరిగిపోయిన సుమతి శతక పద్యాలను సరసమూ, సరళమూ, సామాన్యులకు సైతం సూటిగా, సులభంగా అర్థమయ్యేశైలిలో రాసిన పద్యకారుడు బద్దెన. 162 పద్యాలుగల మరో లఘుకృతి 'నీతిశాస్త్ర ముక్తావళి' కూడా వీరి రచనే. ఈయన ఒక చిన్న సామంత రాజు. తిక్కనకు సమకాలికుడు. 'కమలాసన' బిరుదాంకితుడు. సుమతి శతకంలోని పద్యాలు తేలికైన తెలుగు పదాలతో, ఉపమానాలతో, లోకోక్తులతో, వివిధరకాలైన లోకరీతులతో, గంభీరమైన సత్యాలతో, సరళంగానూ, సరసంగానూ, మనోహరంగానూ వుండడంవల్లనే ఇంతకాలం చిరస్థాయిగా తెలుగు ప్రజల నాలుకలపై నిలిచి వున్నాయి. వేమన (1650 ప్రాంతం) తెలుగు సాహితీలోకంలో కవులెందరున్నా 'ప్రజాకవి' అనిపించుకున్న ఘనత వేమనకే దక్కింది. దీనికి ముఖ్యకారణం- ఆయన కవిత్వం ప్రజల భాషలో, ప్రజలకోసం ఆనాటి ప్రజా సమస్యలపై సాగడమే. వేమననుగాని, ఆయన పద్యాన్నిగాని ఎరుగని తెలుగువాడు వుండడంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. తెలుగు శతక సాహిత్యానికి కవితా ప్రామాణికతను, చారిత్రక పరిపుష్టిని కలిగించిన రచనల్లో వేమన పద్యాలు ప్రముఖపాత్ర వహిస్తాయి. వేమన - సంసారంలో అనేక ఒడిదొడుకులకులోనై, ఆనాడు దేశంలో అస్తవ్యస్తంగావున్న వివిధ మత, సాంఘికాది విషయపరిస్థితులకు సంక్షుభిత మనస్కుడై, కాలక్రమంలో విరక్తచిత్తుడై, సంసారం త్యజించి యోగియై, తత్వజ్ఞానం పొంది దేశం నలుమూలలా సంచరించి తన అనుభవాన్ని, నమ్మకాన్ని నిర్మొహమాటంగా, సూటిగా, వ్యంగ్యంగా, హాస్యంగా, చతురోక్తిగా తేట తెనుగు మాటల్లో ప్రజలకు బోధించారు. వీరి బోధనలు ఆటవెలదులై, తేటగీతలై ఆంధ్ర సరస్వతికి ఆణిముత్యాల హారాలై అలరించాయి. కనుకనే వేమన పద్యాలు పండిత, పామర జనులకు ఇష్ట పద్యాలయ్యాయి.