Sarva Sambhavam
పి.వి.ఆర్.కె.ప్రసాద్ / P.V.R.K. Prasad · Biographies & Auto Biographies

Price: Rs. 225. నాహం కర్తా, హరిఃకర్తా' అనే ఈ పుస్తకాన్ని ప్రచురణకు ముందే ఒక డజనుసార్లు చదివుంటాను. 2003లో మొదటిసారిగా ప్రచురితమైన నాటినుంచి నేటివరకు ఎన్ని జన్లసార్లు చదివానో తెలీదు. ఇప్పటికీ ఏ పుట తెరిచినా. అక్కడ్నుంచి చివరిదాకా చదివేస్తుంటాను. ఈ పుస్తకాన్ని మనసు పెట్టి చదివిన ప్రతి పాఠకుడూ ఆ కథల్లో తిరుమల శ్రీనివాసుణ్ణి ధర్శించారు లేదా భక్తిబాష్పాలు కారుస్తూ ఆ 'దివ్య' అనుభూతిని పొందారు. ఇప్పటిదాకా తెలుగులో అత్యధికంగా అమ్ముడుబోయిన ఒక ఐఏఎస్ అధికారి అనుభవాల సమాహారం ఈ 'నాహం కర్తా, హరిఃకర్తా', సాహితీ ప్రపంచంలో ఇది ఒక చరిత్ర. 2017 ఆగష్టు 20న ఈ పుస్తక రచయిత పత్రి వేంకట రామకృష్ణ ప్రసాద్ గారు స్వర్గస్థులయ్యారు. అయినా ఈ పుస్తకంద్వారా లక్షలాది పాఠకుల మనస్సుల్లో ఆయన చిరస్మరణీయులుగా నిల్చిపోయారు. నేను 'ఈనాడు' ప్రతినిధిగా పనిచేసిన 26 సంవత్సరాలకాలంలో నాలుగేళ్లపాటు (1981-86) తిరుపతిలో పనిచేయటం వల్ల, ఈ పుస్తకంలోని కొత్త ధ్వజస్తంభం ఏర్పాటు, అష్టబంధనం - నవరత్నాలు, విరిగిపోయిన పాలు, కూలిపోయిన విమానం, చిన్నదైన నామం వంటి సంఘటనలకి సాక్షిగా వున్నాను. ఆ కారణం వల్లగానీ, లేదా విశాఖపట్నం, న్యూఢిల్లీ, హైదరాబాద్లలో ప్రసాదారు పనిచేసిన కాలంలోనే నేనూ పనిచేయడం వల్లగానీ, 2002లో ఆయన తన ఈ అనుభవాల్ని 'స్వాతి'కి పంపాలనీ, ఆ తరువాత 'ఎమెస్కో' ద్వారా గ్రంథస్థం చేయాలనీ అనుకున్నప్పుడు నన్ను పిలిచారు. "ఈ పుస్తకంలో రాసే ప్రతి అక్షరానికి నేను శ్రీనివాసుడికి జవాబుదారీ" అన్న ప్రసాద్ గారి నిబద్ధతకి అనుగుణంగా ఆయన మనసులోని భావాల్ని యథాతథంగా అక్షరరూపంలో పెట్టడానికి ఆయనతో కలిసి పనిచేశాను. ప్రసాద్గారి మిగతా పుస్తకాలు - 'అసలేం జరిగిందంటే...', 'తిరుమల లీలామృతం', 'తిరుమల చరితామృతం' కూడా అలాగే వెలుగులోకి వచ్చాయి. సాహితీ ప్రపంచంలో ఇప్పటికీ వెలుగులు పంచుతున్నాయి.