Samaja Chalanapu Savvadi

Editor · Politics

Samaja Chalanapu Savvadi book cover

Price: Rs. 180. మన జీవితాలలో ప్రతి క్షణం జరిగే పరిణామాలన్నీ విడివిడిగా జరిగిపోయేవీ, ఒకదానికొకటి సంబంధం లేనివీ కావు. అవన్నీ ఒక నిరంతర ధారలో భాగం అనీ, ఒకదానితో ఒకటి అన్యోన్య సంబంధంలో ఉంటాయనీ రాజకీయార్థిక శాస్త్రం భావిస్తుంది. అంటే ప్రజాజీవనమంతా రాజకీయార్థిక శాస్త్ర పరిధిలోకి వచ్చేదే. మనిషి మనుగడకు అత్యవసరమైన ఉత్పత్తి ప్రక్రియను మూలాధారంగా భావించి, దానిమీద నిర్మాణమయ్యే సకల మానవసంబంధాలనూ అర్థం చేసుకోవడానికి రాజకీయార్థిక శాస్త్రం ప్రయత్నిస్తుంది. మనచుట్టూ జరిగే ఘటనలు, మనం పాల్గొనే ఘటనలు, మనను ఆలోచింపజేసే ఘటనలు, మన మీద ప్రభావం వేసే ఘటనలు అన్నీ కూడ రాజకీయార్థిక శాస్త్ర ఆవరణలోకి వస్తాయి. ప్రస్తుతమైతే విద్యారంగంలో రాజకీయాలనూ అర్థశాస్త్రాన్నీ విడదీసి చెపుతున్నారు గాని ఒకప్పుడు ఆ రెండూ కలిసే ఉండేవి. రాజకీయాధిపత్యం ఉన్న శక్తులే ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తాయి. ఆర్థిక వ్యవస్థ నిర్వాహకులే రాజకీయాలను శాసిస్తారు. ఈ రెంటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అంతమాత్రమే కాదు, పాత రాజకీయార్థిక శాస్త్రం ప్రస్తుత సామాజిక శాస్త్రాన్నీ, మానవ సంబంధాలనూ, చరిత్రనూ, ప్రభుత్వ పాలననూ కూడ ఒకే సమాహారంగా చూసేది. నిజానికి ఇప్పుడు ఇవన్నీ వేరువేరు శాస్త్రాలుగా విడిపోయి, స్వతంత్ర పారిభాషిక పదజాలాన్ని అభివృద్ధి చేసుకుని, ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టు కనిపిస్తున్నాయి గాని, ఇవన్నీ కలిసి చేసే పని, అంటే రాజకీయార్థిక శాస్త్రం చేసే పని మనిషి గురించీ, సమాజం గురించీ, మనుషుల మధ్య సంబంధాల గురించి ఆలోచించడమే. జీవిత గమనం గురించి చెప్పడమే.

Browse more Telugu books