RAYALASEEMA RACHAYITRULA KADHALU
డా. ఎం. హరికిషన్ / Dr. M. Harikishan · Stories & Poetry

Price: Rs. 270. 1953 నాటి ఆంధ్రరాష్ట్రం, 1956 నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 2014 నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం - ఈ మూడు సందర్భాలలో, భౌగోళిక సరిహద్దులు మారినప్పుడల్లా రాయలసీమకు జరిగింది నష్టమేనని, రాయలసీమ ప్రజలకు మిగిలింది. కష్టాలూ కన్నీళ్ళేనని చరిత్ర రుజువు చేస్తున్నది. రాయలసీమ చరిత్ర అంటే రాయలసీమ ప్రజల జీవితానుభవాలసారమే, గత అయిదున్నర దశాబ్దాలలో తెలుగునేలను పాలించిన వాళ్ళలో రాయలసీమవాళ్ళే ఎక్కువ. కనీసం 15సార్లు రాయలసీమ నాయకులే, రాయలసీమ గెలిపించిన ఇతర ప్రాంత నాయకులే ముఖ్యమంత్రులయ్యారు. అయినా రాయలసీమ ప్రజల కష్టాలు తగ్గిపోవలసినంతగా తగ్గిపోలేదు. నష్టం అరికట్టబడవలసినంతగా అరి కట్టబడలేదు. భౌగోళికంగా మార్పు వచ్చినప్పుడంతా రాయలసీమ పరిస్థితి పెనం మీదినుంచి పొయ్యిలో పడినట్లొతున్నది. వడ్డించేవాడు మనవాడైతే ఏ పంక్తిలో కూర్చున్నా ఒకటే అనే సామెత రాయలసీమ విషయంలో అబద్ధమని రుజువౌతున్నది. దీనికి వివరణ, గణాంకాలు అక్కరలేదు. రాయలసీమ ప్రజల జీవనవిషాదాలే నిదర్శనాలు. ఒక ప్రాంతం ఇతర ప్రాంతాలతో కలిసి సహజీవనం చేస్తున్నప్పుడు, తాను సహజంగా వుండవలసిన అభివృద్ధిని పొందలేనపుడు, ఆ సహజీవనం ఎందుకు? అనే ప్రశ్న కలగడం సహజం. అన్ని ప్రాంతాలూ సమానాభివృద్ధిని పొందకపోతే, ఆ కలయికకు అర్ధముందా? అని సందేహం కలుగుతుంది. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి సాధ్యం కానపుడు, ఏ ప్రాంతానికాప్రాంతం తనను తాను అభివృద్ధి చేసుకుంటే తప్పేమిటని కూడా అనిపిస్తుంది. రాయలసీమ నాలుగు జిల్లాల నుండి ముఖ్యమంత్రులు రూపొందినా, ఈ ప్రాంతం ఇంకా ఎందుకు ఇలా ఉంది అని కూడా అనిపిస్తుంది. ఇది ఇప్పటి రాయలసీమ అస్తిత్వ ప్రశ్న.