RAYALASEEMA PREMA KATHALU
Dr. M. HARIKISHAN / డా. ఎం. హరికిషన్ · Stories & Poetry

Price: Rs. 180. ఒకప్పుడు రాయలసీమ సాహిత్యం అనగానే శ్రీకృష్ణదేవరాయల సాహితీవైభవమే గుర్తుకొచ్చేది. ఇప్పుడు కరువులు, కార్పణ్యాలు మాత్రమే రాయలసీమ అస్తిత్వంగా చూడబడుతున్న నేపథ్యంలో “రాయలసీమ ప్రేమకథలు" సంకలనం రావడం పూర్వ పాక్షిక సత్యంగా ఋజువు చేస్తుంది. ఈ ప్రయత్నం సీమవాసులకు గర్వం. సీమేతర సహృదయుల స్పందనలకు ప్రేమాస్పద ఆహ్వానం కాగలవు. రాయలసీమలో ప్రేమకథలు లేవా? అనే ఆలోచనలు కలిగినపుడంతా ఆసక్తిగా పుస్తకాలు తిరగేయడం, మరుసటిరోజు మరోపనిలో కూరుకుపోవడం జరిగేది. చలం కథలు చదివినపుడంతా ప్రేమ కోసం పరితపించిన స్త్రీమూర్తులందరూ కళ్ళ ముందు నుండి కదిలేవాళ్ళు కాదు. అలాంటి పాత్రలు రాయలసీమ నుండి కానీ, తెలంగాణ నుండి కానీ, ఉత్తరాంధ్ర నుండి కానీ ఎందుకు రాలేదా అని పరితపించేదాన్ని. దశాబ్దాల నుండి వెంటాడుతున్న బాధ నుండి విముక్తం చేసే సంకలనం తయారవుతుందని కర్నూలుకి చెందిన సాహితీ మిత్రుడు డా. ఎం. హరికిషన్ చెప్పినపుడే ఉద్వేగానికి లోనయ్యాను. సంకలనానికి ముందుమాట రాయమనగానే ఒప్పుకున్నందుకు మంచి ప్రతిఫలమే దొరికింది. చలం స్త్రీ పాత్రలకు ధీటైన పాత్రలను బొగ్గులబట్టిలో కాలి పుటం పెట్టిన బంగారం లాంటి రంగమ్మను, మెర్సీని, మధుర మీనాక్షిని, సిస్టర్ రెజీనాను, జాస్మిన్, సుధారాణి, అచ్చమ్మవ్వను కలుసుకోగలిగాను. సంపాదకుడు ఏర్పరచుకొన్న ప్రమాణాల నిర్దిష్టత సంకలనంలోని కథల ఎన్నిక క్రమమే ఎరుకజేస్తుంది. హరికిషన్ చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు, మూడు పర్యాయాలు తర్కించుకుంటూ, మిత్రులతో గంటలకు గంటలు చర్చించి తేల్చుకొన్న శ్రమ కూడా తెలుస్తుంది. ఈ సంకలనంలో కథల్ని చేర్చుకోవడానికి, మరి కొన్నింటిని చేర్చలేక పోవడానికిగానీ గల కారణాలు కూడా కథల ఎంపికే తెలుపుతుంది.