Prutha Therachina Putalu / పృథ తెరచిన పుటలు

వేలూరి కృష్ణమూర్తి / Veluri Krishnamurthy · Novels

Prutha Therachina Putalu / పృథ తెరచిన పుటలు book cover

Price: Rs. 135. మహాభారతంలో కుంతిది అపూర్వమైన పాత్ర, నిండైన వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, సంయమనంతో జీవితాన్ని నెగ్గుకు వచ్చిన ధీర మహిళ. అనేక కష్టాలనీ, అవమానాలనీ సహిస్తూనే అనురాగమయిగా గడిపిన కుంతి కోణంలోంచి మహాభారత కథని వివరించిన సృజనాత్మక రచన ఇది. అరణ్యంలోని ఒక చెట్టుపైన గూటిలో తల్లి వెచ్చని ఒడిలో వుంటూ వెలుపలి ప్రపంచ జ్ఞానమే లేక హాయిగా నిద్రిస్తున్న ఒక పక్షి పిల్లను బలవంతంగా ఎత్తుకుపోయి రాజాంతఃపురంలోని బంగారు పంజరంలో ఉంచినపుడు, కలిగే అనుభవాన్ని తన బాల్యంలోనూ, యవ్వనంలోనూ అనుభవించిన యువతి కుంతి అని ఈ నవలా రచయిత్రి చెబుతారు. ఈ మాట అక్షరాలా నిజమని ఈ నవల చదివితే బోధపడుతుంది. ఇదివరలో కొందరు రచయితలు మహాభారతాన్ని భిన్నకోణాల్లో సృజించారు. కానీ ఒక మహిళ కోణంలోంచి, ముఖ్యంగా అందులో భాగమైన కుంతి స్వగతంలోంచి విన్నపుడు పొందే సృజనానుభవం విభిన్నమైంది. నిజానికి కుంతి అంతరంగాన్ని విప్పి చూపిన మొదటి రచన ఇది. కన్నడంలో విజయ చంద్రమౌళేశ్వర్ రాసిన ఈ నవల కుంతి వ్యక్తిత్వాన్ని, అంతరంగ కల్లోలాన్ని ఆర్ద్రమైన రీతిన చిత్రించింది. తన పిల్లలను అవమానించినప్పటికీ ధృతరాష్ట్రుడు, గాంధారిలతోపాటు వానప్రస్థాశ్రమానికి కుంతి వెళుతుంది. వార్ధక్యంలో వారికి అండగా ఉండాలన్న సేవాదృక్పథమే దీనికి మూలం. కుంతి కరుణాంతరంగానికి ఇంతకు మించిన తార్కాణం మరేదీ అక్కర్లేదు. ఈ నవల ద్వారా కుంతితో పాటు గాంధారి, మాద్రి, ద్రౌపది వంటి మహిళల ఉన్నత వ్యక్తిత్వం, ఔదాత్త్యం ప్రస్ఫుటమవుతుంది. కన్నడంలో బహుళ ఆదరణ పొందిన ఈ నవలని తెలుగులోకి అందంగా అనువదించారు వేలూరి కృష్ణమూర్తి. వారి అనుసృజన ఈ నవలకు చదివించే గుణాన్ని సంతరించి పెట్టింది. కొత్తగా మహాభారత కథని చదువుతున్న అనుభూతిని అందించే ఈ నవల చదవడం పాఠకుల సమయాన్ని ఫలవంతం చేస్తుందన్నది నిస్సందేహం.

Browse more Telugu books