prema
Yaddanapudi Sulochana Rani · Novels

Price: Rs. 112. సాయం సమయం! నవంబరు నెల. చల్లటి చిరు చలిగాలి వుండి, వుండి రయై వీస్తోంది. వీధులన్నీ ఇళ్ళకి తరలివెళ్ళే కార్లు, స్కూటర్లు, ఆటోల సముదాయంతో, కిక్కిరిసి, రద్దీగా వున్నాయి. అస్తమిస్తున్న అరుణబింబం హైదరాబాద్ చూడటానికి వచ్చి, ఈ నగర హొయలుకి ముగ్ధుడైన, గల్ఫ్ దేశపు షేక్, వదిలి వెళ్లలేక వెళ్తూ, ఆమె మీద బంగారం దీనారాలు గుమ్మరించి వెళ్తున్నట్టుగా, పసిడికాంతులు విరజిమ్ముతోంది. జంటనగరాల మధ్యలో వున్న టాంక్బండ్ మీద సన్నటి మేలి ముసుగులా, పొగమంచు ఆవరించుకుంది. టాంక్బండ్ మీదనుంచి వస్తున్న జన సముదాయంలో ఒక అమ్మాయి సైకిలుమీద వస్తోంది. అస్తమిస్తున్న అరుణకాంతులతో ఆమె ముఖకాంతి దీటుగా వుంది. బ్లాక్ జీన్స్ మీద పసుపురంగు బెన్టైన్ టీ షర్ట్ బంధించింది. పొట్టిగా కత్తిరించిన జుట్టుని పైకి గట్టిగా దువ్వి ప్లాస్టిక్ పిన్తో వేసుకుంది. ఆమె ఎంత క్రమబద్ధంగా బంధించినా, నాలుగయిదు ముంగురులు ఆ బంధంనుంచి విడివడి వుండి వుండి వస్తున్న గాలికి ఆమె నుదుటిమీద అల్లరి పిల్లల్లా ఆనందంగా డాన్స్ చేస్తున్నాయి. ఆమె మెడలో సన్నటి గొలుసు తప్ప, ఒంటిమీద ఇంకే ఆభరణాలూ లేవు. చేతులు బోసిగా వున్నా, అదో అందంగానే వుంది.