Paatalu Puttina Thaavulu
Vadrevu Chinaveerabhadrudu / వాడ్రేవు చినవీరభద్రుడు · History

Price: Rs. 135. భారతీయ చరిత్రలో, సాహిత్యంలో, సంస్కృతీ నిర్మాణంలో రెండువేల యేళ్ళుగా తమిళనాడు పోషించిన పాత్ర అద్వితీయం. ప్రాచీన తమిళదేశంలో సంగం, జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ సాహిత్యాలు ఒక అలౌకిక సౌందర్యాన్ని, తమిళ ప్రాకృతిక సీమకి జతపరుస్తూ తమిళజాతికొక సాహిత్య సంస్కారాన్ని సమకూరుస్తూ వచ్చాయి. సంగం సాహిత్యం తమిళ భూగోళాన్ని ఐదు ప్రాకృతిక సీమలుగా గుర్తించి వాటిని ఐదు ప్రణయావస్థలతో జతపరచి అద్భుతమైన ప్రేమ కవిత్వాన్ని సృజించింది. ఆ కవిత్వపు పాదులో వికసించిన భక్తికవులు భారతీయ భక్తి సాహిత్యానికే మార్గదర్శకులయ్యారు. వారి అడుగుజాడల్ని అన్వేషిస్తూ ప్రసిద్ధ కవి, రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన సాహిత్యయాత్రా కథనం ఈ పుస్తకం. ఇందులో సంగ కాల కవులైన కపిలార్, అవ్వయ్యార్, తిరువళ్లువర్, ఇళంగోఅడిగళ్ నుండి కారైక్కల్ అమ్మైయ్యార్, తిరుమూలార్, అప్పర్, తిరుజ్ఞాన సంబంధర్, సుందరమూర్తి, నందనారు వంటి సుప్రసిద్ధ నాయన్మార్ లతోపాటు నమ్మాళ్వారు, తిరుమంగై, ఆండాళ్ వంటి ఆళ్వారులు సంచరించిన తావుల్లో తిరుగాడి వారి గురించిన కథలు స్మరించుకుంటూ వారి కవిత్వాన్ని తెలుగులో పలవరించటం ఈ కథనం విశిష్టత. నాయనార్లు, ఆళ్వార్లతో పాటు అరుణగిరినాథార్, రమణులు, అరవిందులు, సుబ్రహ్మణ్యభారతియారు, యు.వి.స్వామినాథ అయ్యర్ల గురించిన తలపోత కూడా ఈ పుస్తకంలో కనిపిస్తుంది. హిమగిరి శిఖరాల వంటి ఈ మహనీయ తమిళ కవులు, సాహిత్యవేత్తలతో పాటు త్యాగయ్యని, చలం గారిని కూడా తలుచుకోవటంతో ఈ సంపుటికి ఒక నిండుదనం సమకూరింది.