Nishantha
యద్దనపూడి సులోచనారాణి / Yaddanapudi Sulochana Rani · Novels

Price: Rs. 85. గ్లాస్ డోర్ తెరుచుకుని పృథ్వీ ఆ గదిలోకి వచ్చాడు. అతను లోపలికి రాగానే వెనక తలుపులు మూసుకున్నాయి. అతను ధరించిన లేత గోధుమరంగు సూటు, ఎడమచేతికి వున్న వాచీ, వజ్రపు టుంగరం, కుడి ముంజేతికి వున్న గొలుసు, ఆ చేతితో పట్టుకున్న బ్రీఫ్ కేస్ అతని ఆర్థిక వున్నతస్థితిని తెలియచేస్తున్నాయి. అతని నడకలో హుందాతనం, చురుకైన కళ్ళలో తెలివి, యీ ప్రపంచపుస్తకంలో మనుష్యుల్ని గురించి క్షుణ్ణంగా చదివి, వారి చిత్రవిచిత్ర స్వభావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని, ఎవరితో ఎలా ఢీకొనాలో ఆ నేర్పరితనంలో ఆరితేరిన అనుభవంగలవాడిలా, వారందరిలో తనొక ప్రత్యేకవ్యక్తిని అని, తనని గురించి కూడా తనకే మిగతా అందరికంటే బాగా తెలిసిన వాడిలా వున్నాడు. పృథ్వీ ఆ గదిలోకి రాగానే, చేతిలో బ్రీఫ్ కేస్ టేబుల్మీద పెట్టి ఒకసారి గట్టిగా హాయిగా గాలి పీల్చుకొన్నాడు. ఎడమవైపు ఎదురుగా కనిపిస్తున్న హెచ్.సి.యల్. వారి 'బిజీబీ' కంప్యూటర్, కుడివైపు ఐ.బి.యమ్.వారి మరో కంప్యూటర్. అతని కళ్ళు యీ ప్రపంచంలో అతనికి అత్యంత ప్రియాతి ప్రియమైనవాటిని చూసినట్టు ఆనందంగా చూసినాయి. ఆఫీస్టెబిల్, దానిమీద ఫోన్, టేబిల్దగ్గర రివాల్వింగ్ ఛైర్, పక్కనే తాళం వేసివున్న గాడ్రెజ్ బీరువా ఇదంతా అతని ప్రత్యేక ప్రపంచం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ గది అతని జీవనాడి. ఈ గదిలోకి అడుగుపెట్టగానే బైట ప్రపంచం గురించిన ఆలోచనలు, మూసిన ఆ తలుపుల వెనకనే ఆగిపోతాయి. లోపలికి రాలేవు. అతన్ని చికాకు పెట్టలేవు.