Neram - Beram / నేరం-బేరం
సతీష్ చందర్ / SATHISH CHANDR · Novels

Price: Rs. 180. వ్యంగ్యరచనలో సతీష్ చందర్ అగ్రగణ్యులు. పత్రికా సంపాదకుడిగా, కవిగా, కథా రచయితగా, సాహిత్య విమర్శకుడిగా పాఠకులకు సుపరిచితులు. 'ఆంధ్రప్రభ' దినపత్రికకు ప్రధాన సంపాదకుడిగా పనిచేశారు. 'వార్త' దినపత్రికకు సహ వ్యవస్థాపక సంపాదకులు కూడా. గత 14 యేళ్ళుగా 'గ్రేట్ ఆంధ్ర' కు ఆయనే ఎడిటర్. అంతేకాదు, గత ఏడాదే రజతోత్సవం జరుపుకున్న ఎ.పి. కాలేజ్ ఆఫ్ జర్నలిజం వ్యవస్థాపకులు. సతీష్ చందర్ ఇంతవరకూ 26 గ్రంథాలు ప్రచురించారు. వీటిలో ఏడు (మేడిన్ ఇండియా- 1992. ఇతిహాసం- 1995, ధరువు-2002, చంద్రహాసం- 2006, కింగ్ మేకర్-2013, గోధనం - 2016, బూత్ బంగ్లా-2021) వ్యంగ్య రచనలే. 'నేరం - బేరం' 27వ గ్రంథం. వ్యంగ్యరచనల్లో ఎనిమిదవది. “నేరం-బేరం' అనే ఈ గ్రంథం నూటికి నూరుపాళ్ళూ రాజకీయ వ్యంగ్య నవల. రాజకీయాల్లోకి రావాల్సిన వాళ్ళు రాక పోతే, వచ్చేది నేరగాళ్ళూ లేదా బేరగాళ్ళే. నేరగాళ్ళు కింది నుంచి లేస్తే, బేరగాళ్ళు పై నుంచి దిగుతారు. దోపిడీలో దోపిడీ! జేబు కత్తిరించే వాడు ఒకడయితే, అందులోని క్యాష్ కాజేసేవాడింకొకడు. ఇద్దరినీ కులం సృష్టించి వదిలేస్తే, వాళ్ళతో మార్కెట్ ఆడుకుంటుంది. ముచ్చటగా వాడుకుంటుంది. కూడా. ఇదే ఆటయితే, చూసిన వాళ్ళు బేజారెత్తి 'బజారు' స్వామ్యం అనాలి. కానీ మనవాళ్ళు సహృదయులు, ప్రజాస్వామ్యంగానే పరిగణిస్తున్నారు. ఎందుకో మరి..? చదవండి. కారణం ఈ నవలలో దొరికేస్తుంది. ఈ నవల శైలి వేరు. లబ్ డబ్ లబ్ డబ్ మంటూ.. మీ గుండె వేగంతో రచన పోటీ పడుతుంది. ఊపిరి తీసి, వదిలేసరికే వాక్యం ముగిసిపోతుంది. నిమిషం అయ్యిందో.. పేజీ తిరిగిపోతుంది. 'అదా సంగతీ..!' అని అనుకునేలోగానే అధ్యాయం దొర్లిపోతుంది. కానీ, మీరేదో చిత్రమయిన పుస్తకం చదువుతున్నట్లు మాత్రం, పక్కవాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే, మీలో మీరు నవ్వుకుంటుంటారు.