Mera Jahan
Editor · Novels

Price: Rs. 270. తెలంగాణ తనాన్ని బహుజన సోయితో, ఛాందస, బానిస భావాలకు వ్యతిరేకంగా షాజహానా రాసిన 'మేరా జహాఁ' కచ్చితంగా నవలా సాహిత్యానికి మేలైన చేర్పు. ఈ దివిటీ కొత్త వెలుతుర్లను ప్రసరింపజేస్తది. మరిన్ని కొలిమిలను రాజేస్తుంది. యువతరం మహిళా రచయితలు,' మొహర్ 'కథకులు ముందుకు రావడానికి ఈ నవల స్ఫూర్తిగా నిలబడుతుంది. - సంగిశెట్టి శ్రీనివాస్ సలీమా పాత్ర అబ్బురంగా, గొప్పగా, సాహసిగా, ఓ ప్రశ్నగా, ఓ సమాధానంగా, ఓ విప్లవంలా కనిపిస్తుంది. అందరూ సలీమాలై ముస్లిం మహిళలను చైతన్యపరిచి పరదాలు దాటించాలనే కోరిక తప్పక పుడుతుంది. భవిష్యత్ కర్తవ్యాన్ని మనకు గుర్తుచేస్తుంది. - సలీమా షేక్ 'మేరా జహా' సలీమా చేసిన ప్రయాణం బయటి ప్రపంచంలోకే కాక లోపలి ప్రపంచంలోకి కూడా. ఆమె లోపలి ప్రపంచం వజ్రం కంటే కఠినమైంది. పువ్వు కంటే సున్నితమైంది. మనోవైజ్ఞానికంగా పరిశీలిస్తే సలీమా వ్యక్తిత్వంలోని బహుముఖాలు గోచరిస్తాయి. సలీమా వ్యక్తిత్వాన్ని తెలుపు నలుపుల్లో కాకుండా బహుళ వర్ణ సమ్మిశ్రితంగా రూపొందించడంలో రచయిత్రి నిజాయితీ అర్థమౌతుంది. - ఎకె ప్రభాకర్ 'మేరా జహాఁ' నలభై యేళ్ల సామాజిక రాజకీయ ఆర్థిక పరిణామాల ప్రతిబింబం. దేశంలో సంభవించిన అనేకానేక విపరిణామాల కళాత్మక ప్రతిఫలనం. - జిలుకర శ్రీనివాస్ ముస్లిం జీవితాన్ని విస్తృత కాన్వాస్ మీద ప్రదర్శించటానికి నవలను మించిన ప్రక్రియ లేదు. ఆ దిశగా వెలువడిన ముస్లిం మహిళల కౌటుంబిక సామాజిక జీవిత ఇతివృత్తమే 'మేరా జహాఁ'!. తెలుగు నవలా సాహిత్య చరిత్రలో ముస్లిం స్త్రీల జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొన్న తొలి ముస్లిం మహిళా రచయిత్రిగా షాజహానా తన పేరును నమోదు చేసుకొన్నది. - కాత్యాయనీ విద్మహే