Manasu Gathine Marchina Freud
Editor · History

Price: Rs. 160. ఈ గ్రంథాన్ని చదవటం ద్వారా పాఠకుడు, శైశవం, బాల్యంలో, తన మనోవల్మీకంలోకి ప్రవేశించిన విష సర్పాల జాడలను, తన మస్తిష్కంలోని ముళ్లకంపలను తెలుసుకోగలుగుతాడు. ఇప్పటి తన వైయక్తిక వక్రతలు, లైంగిక అపసవ్యతలను అంచనా వేసుకోగలుగుతాడు. మానవుల శరీరాలకే కాక ఆత్మలకూ రోగాలు వస్తాయి. శారీరక రోగ లక్షణాలకు చికిత్స చేసే వైద్యుడు శరీరంలోని ఒక భాగానికే వైద్యం చేస్తున్నాడు. మానవుడంటే శరీరం ఒక్కటే కాదు, సహజాతాల (INSTINCTS), అంతరాత్మల రణరంగం. ప్రచోదనలను అణచివేసే యుద్ధ భూమి. యుద్ధం అనివార్యం. బాహ్య ప్రపంచంలోని సంఘధర్మాలకు, స్వీయ అంతరంగ ప్రపంచంలోని ఇచ్చ,సంవేదనలకు మధ్య మానవుడు సాహసోపేతమైన సేనాని కావాలి, ధీరుడైన న్యాయ నిర్ణేత కావాలి. అలాకాక భీరువై పలాయనం చిత్తగిస్తే రుగ్మతకు గురవుతాడు. "సౌందర్య భావనకు మూలం లైంగికోద్దీపన క్షేత్రంలో ఉంది. లైంగికంగా ఉద్రేకాన్ని కలిగించిన దానిని మాత్రమే మొదట్లో ఈ సౌందర్య భావన సూచించిందని నా నమ్మకం. ఇక్కడ ఒకటి ముఖ్యంగా గమనించాలి. దర్శన మాత్రాన అత్యంత లైంగికోద్రేకాన్ని రేకెత్తించే జననాంగాలు నిజంగా 'అందమైనవి' అని అనలేం! " "ఈ యుద్ధం మనలోని పైశాచిక సహజాతాలను నగ్నంగా ప్రదర్శిస్తుంది. మన అంతరాంత రాలలో దాగిఉన్న పైశాచిక శక్తుల్ని గొలుసులు త్రెంచుకొని గంతులు వేయనిచ్చాము. శతాబ్దాలు గడిచినా వాటిని ఇక మనం మచ్చిక చేసుకోలేక పోయాము." "పూవులు చూడడానికి ప్రశాంతంగా ఉంటాయి. వాటికి ఉద్వేగాలు, వ్యాకులతలు ఉండవు గదా!" *** దేవునిపై విశ్వాసం నెలకొనడానికి మూలం మానవ నిస్సహాయత. ఈ నిస్సహాయతను మానవుడు శైశవంలో అనుభవిస్తాడు. శిశువును తండ్రి కాపాడి రక్షిస్తాడు. కాని శిశువు పెరిగి పెద్దవాడైన తరువాత గూడ అతనిని నిస్సహాయత వదలి పెట్టదు. ఎలాగంటే, పెద్దవాడయ్యే కొలది అతనికి జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ సమస్యల బరువూ, గురుత్వమూ పెరుగుతుంది. చిన్నప్పుడు చిన్న సమస్యలైతే, పెద్దయిన తరువాత పెద్ద సమస్యల పరిష్కారానికి 'పెద్ద తండ్రి'ని ఆశ్రయించాలి. ఈ పెద్ద తండ్రే సర్వశక్తి మంతుడని భావించబడుతున్న దేవుడు.