Kothi Kommachhi
Editor · History

Price: Rs. 675. ఇది తారీఖులవారీ ఆత్మకథ కాదు, మహానుభావులతో తనకెదురైన వింత వింత అనుభవాలను నిజాయితీగా, నిర్భీతిగా పాఠకులతో పంచుకుంటూ, ఒక రసవద్దటం నుండి మరో రమ్యమైన ఘట్టానికి శాఖాచంక్రమణం చేస్తూ, కొత్త కొత్త పదబంధాలను అల్లుతూ, చమత్కార శైలితో మనని మురిపిస్తూ, ఆ కాలంలోకి తీసుకుపోయి ఆ యా మనుషుల మధ్య విహరింపజేశారు. కోతికొమ్మచ్చి చదువుతుంటే లోపలనుండి పొంగుకు వచ్చేది నవ్వో, ఏడుపో తెలీదు. దారిద్ర్యాన్ని ఇంత రొమాంటిక్ గా చూడవచ్చా!? అని ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని ఆకలి జోకులు చదువుతుంటే నవ్వొచ్చి అంతలోనే తమాయించుకుని నవ్వకూడదేమో, జాలిపడాలి కాబోసు అనిపిస్తుంది. కానీ జాలిపడమని రమణ ఎక్కడా అడగలేదు. జీవితంలో అన్నీ చూసిన వేదాంతి నిర్వేదంతో తన జీవితాన్ని పొరపాట్లతో సహా సమీక్షించుకుంటున్నట్లుగా, ఉన్నదున్నట్లుగా రాసుకుపోయారు. డ్రమటైజ్ చేయవలసిన అవసరం లేకపోయింది. కావలసినంత డ్రామా సహజంగానే వుంది ఆయన జీవితంలో... ఎమెస్కో గతంలో 'బాపూ కార్టూన్లు,' ముళ్ళపూడి వెంకటరమణ గారి 'ఋణానందలహరి', 'తిరుప్పావై' వంటి రచనలను ప్రచురించింది. ఇదివరలో 'కోతికొమ్మచ్చి' మూడు భాగాలుగాను, అదనంగా 'కొసరు కొమ్మచ్చి' నాలుగో భాగంగాను హాసం ప్రచురణల పక్షాన ప్రచురితమయ్యాయి. పాఠకుల సౌలభ్యంకోసం ఇప్పుడు ఆ నాలుగు పుస్తకాలను ఒకే పుస్తకంగా ఎమెస్కో ప్రచురిస్తోంది.