KANKA PODA / కంకపొద
Kalyani Kunja / కల్యాణి కుంజ · Stories & Poetry

Price: Rs. 135. గడిచిపోయిన జ్ఞాపకాలని పరిగేరినట్టో, రేగు పళ్ళేరినట్టో యేరుకొని తెచ్చి కళ్యాణి కవిత్వ వాక్యాలుగా అల్లింది. తన చిన్నప్పటి నీడని తానే తొక్కుకుంటూ వాకిట్లో జ్ఞాపకాల ముగ్గుల్ని నింపి గొబ్బెమ్మయి పూచింది. అలా అన్జెప్పి అన్నీ మధుర స్మృతులే కావు; 'పొద్దాంస్క రెక్కలు ముక్కలైనా తవామ్ లేనప్పుడు తౌడు బుక్కిన' చేదు యాదులు కూడా వున్నాయి. మనసుతో పనిలేని సజీవ దహనాలున్నాయి. మూగ రోదనలున్నాయి. - ఎ కె ప్రభాకర్ . .. తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలను కలిగి ఉన్న తెగ కోయ, దొరసొట్టపోళ్ళు. ఈ తెగనుంచి వచ్చిన సాహిత్యకారులు తక్కువ. స్త్రీలలో కవిత్వం రాస్తున్నవాళ్ళలో పద్దం అనసూయ తర్వాత కనిపించే పేరు కల్యాణి కుంజ. ఒక గూడెంలో పుట్టి తెలుగు ఎం. ఏ. దాకా చదివి, ఉపాధ్యాయిని దాకా ఎదిగిన ఈ కవయిత్రి నిఖార్సయిన అడవిబిడ్డ. కొండలు కోనలు దాటి, గూడెం బతుకుల ఆత్మతో తనదైన వ్యక్తీకరణతో కవిత్వంగా నిలబడింది. రిల్లలు రిల్లలుగా ఒకదానితో ఒకటి పెనవేసుకునే కొమ్మలచెట్టు 'కంకపొద'లా కలిసిపోయివుండే 'తమ జాతి జనుల' ప్రతీకగా ఈ సంపుటికి 'కంకపొద' పేరునే ఖాయం చేసింది. మా రొట్టమాకురేవు ఊరుకూడా కల్యాణి కుంజ పుట్టిన ఊరులాంటిదే. అందువల్లే ఈ కవిత్వం మా ఊరుబతుకుల సంబంధిలానే అనిపించింది. ఆ వేదనే, ఆ పెనుగులాటలే, ఆ ఎదగలేని అడ్డంకులే. ఇకపై ఇంకా లోతుల్లోకి వెళ్లి అక్కడి భాషనే, వ్యవహారికాన్నే, వ్యక్తీకరణలనే పదిలంగా కవిత్వంలోకి తెమ్మని కోరుకుంటున్నాం. అది తప్పనిసరి అవసరం. -కవియాకూబ్, శిలాలోలిత