JASHUVA RACHANALU
Gurram Jashuva. / గుఱ్ఱం జాషువ · Stories & Poetry

Price: Rs. 207. జాషువ గుఱ్ఱం వీరయ్య- లింగమాంబలకు 1895, సెప్టెంబరు 28న వినుకొండలో జన్మించారు. సాహితీ క్షేత్రమందు కృషీవలుడు కావాలనే కాంక్షతో ఆనాటి అననుకూల వాతావరణాన్నీ, సానుభూతి కేర్పడిన దుర్భిక్షాన్నీ ఎదుర్కొంటూ ముందుకు సాగారు. కృషితో “నాస్తిదుర్భిక్షం” నానుడి యదార్థమైంది. అనావృష్టులు, గాలివానలు గత స్మృతులయ్యాయి. కవితాసుక్షేత్రంలో పసిడినే పండించారు. ప్రాథమికోపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, నాటి మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా ఊరురా తిరిగి, వీరేశలింగం, చిలకమర్తుల ఆశీర్వాదాలు పొంది కావ్యజగత్తులో స్థిరపడ్డారు. తిరుపతి వేంకట కవుల ప్రోత్సాహం ముందుకు నడిపింది. ఉభయ భాషా ప్రవీణులై తెలుగు పండితునిగా, ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయంలో యుద్ధ ప్రచారకునిగా, స్వాతంత్ర్యానంతరం 1956 నుండి 1960 వరకూ ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తెలుగు ప్రొడ్యూసరుగా ఉద్యోగాలు నిర్వహించారు. కవితాభిమానులు, సాహితీ సంస్థలచే వేయికిపైగా సన్మానాలు పొందారు. కవికోకిల, కవితా విశారద, కవిదిగ్గజ, మధుర శ్రీనాథ, నవయుగ కవిచక్రవర్తి, విశ్వకవి సామ్రాట్ బిరుదులు పొందారు. గండ పెండేరం ధరించి, కనకాభిషేకాలు పొంది, గజారోహణము చేసి, పగటి దివిటీల పల్లకీలో ఊరేగారు. గుంటూరు పట్టణం స్వేచ్ఛా పౌరసత్వమిచ్చి గౌరవించింది. కేంద్ర సాహిత్య అకాడమీ 'క్రీస్తుచరిత్ర' కావ్యానికి అవార్డు బహూకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనమండలి సభ్యునిగా నియమించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ' బిరుదాంకితుని చేసింది. రాష్ట్రపతి “పద్మభూషణ్" ఇచ్చి సత్కరించారు. ముప్పదికి పైగా రచనలు చేసి 1971 జూలై 24న కీర్తిశేషులైనారు.