Indian Democracy
Prabhakar Mandara / ప్రభాకర్ మందార · Politics

Price: Rs. 28. "ప్రజల ఆర్థిక, సామాజిక జీవితాల్లో విప్లవాత్మక మార్పులను ఏ రక్తపాతమూ లేకుండా తెచ్చే ప్రభుత్వ రూపమే ప్రజాస్వామ్యం" అంటాడు అంబేడ్కర్. రాజ్యాంగం, ఓటుహక్కు, ఎన్నికలు... ఈ మూడూ వుంటే చాలు ఆ దేశంలో ప్రజాస్వామ్యం వున్నట్లే అని భావించడం పొరపాటు. అవన్నీ పాలక వర్గానికే ఉపయోగపడుతున్నాయనీ, పైగా వారి పెత్తనానికి చట్టబద్ధతను కల్పిస్తున్నాయని, సామాన్య జనానికి వాటివల్ల ఒరుగుతున్న దేమీ లేదని ఆవేదన చెందుతాడు. ప్రజల మధ్య సామాజిక సమానత్వం, స్వేచ్ఛ లేనప్పుడు ఆ ప్రజాస్వామ్యానికి అర్ధం లేదు. సామాజిక సమానత్వానికీ, ఆదర్శాలకూ, సమైక్యతకూ భారత దేశంలో కులవ్యవస్థ పెద్ద అడ్డంకి. అది ప్రజాస్వామ్య మూలాలను తొలచివేస్తుంది. ఒక కులం వారు ఒక వృత్తికే కట్టుబడి వుండాలనడం ప్రజాస్వామ్య మూల సూత్రాలకే విరుద్ధం. దొంతరలతో కూడిన కులవ్యవస్థ వల్ల వెనుకబడిన, దళితకులాల్లో కూడా ఒకరు మరొకరి కంటే ఎక్కువనో తక్కువనో భావిస్తున్నారు. ఏ కులం వాడూ తనకంటే తక్కువ కులం వాడి హక్కుల కోసం పోరాడేందరుకు ముందుకురాడు. భారతీయులు కుల ప్రాతిపదికనే ఓటు వేస్తారు. చివరికి పార్టీలు కూడా ఆ నియోజకవర్గంలో ఏ కులం ఓటర్లు ఎక్కువగా వుంటే ఆ కులం అభ్యర్థినే పోటీకి నిలబెడుతున్నాయి. భారతీయుల ఆలోచనలు అడుగడుగునా తప్పుడు విలువలతో, తప్పుడు దృక్పథాలతో పక్కదార్లు పడుతున్నాయి. ప్రస్తుత విద్యావిధానం కూడా కులవ్యవస్థను పెంచి పోషిస్తోందే తప్ప కుల నిర్మూలనకు ఏమాత్రం దోహదం చేయటం లేదు. చదువుకున్న వ్యక్తుల్లో సామాన్యుల కంటే స్వార్థం, కుల పిచ్చి పెరిగిపోవడం గమనించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఏమైపోతుంది? మన ప్రజాస్వామ్యానికి దిక్కెవరు? దీనిని ఎలా రక్షించుకోవాలి? అనే అంశంపై డా॥ అంబేడ్కర్ ఆచోచనల సమాహారమే ఈ పుస్తకం.