Hampi Express
Editor · Novels

Price: Rs. 179. నేను పుట్టి పెరిగి బాల్యాన్ని గడిపిన ఊరు బళ్ళారి జిల్లాలో ఉంది. తరువాత బతుకు సాగించటం కోసం బెంగళూరు నగరానికి చేరుకున్నాను. నా బాల్యాన్ని, బతికిన ఊళ్ళను 'హంపి ఎక్స్ప్రెస్' అనే రైలు జతకలుపుతుంది. అక్కడి జీవిత వివరాలను ఇక్కడికి, ఇక్కడివి అక్కడికి రవాణా చేసే లంకెలా ఈ రైలు సంచరిస్తుంది. ఒక విధంగా ఇది తల్లితోపాటు జీవద్రవ్యాన్ని పంచుకునే బిడ్డ బొడ్డుతాడులా పని చేసింది. ఈ రైలు పట్ల నాకు ప్రత్యేకమైన ప్రేమ. అందులో ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడలేని సంతోషం. దూరంగా పరిగెడుతున్న రైలును చూసినా చాలు, కళ్ళు ఆర్ద్రమవుతాయి. ఆ రైలు మా ఊరికథలను బెంగళూరులోని నియాన్ కాంతిలో చూపించి, ఇక్కడి కథలను అక్కడి లాంతరు వెలుతురులో కనిపించేలా చేసింది. ఈ సుదీర్ఘ సంచారంలో బతుకు కొత్త అర్థాలను విరజిమ్మింది. సమస్త జగత్తులోని మనుష్యులంతా ఒక్కటే అనే ఆత్మీయ భావనను ఇది ఏర్పరిచింది. బృహత్ నగరాలలో నివసించే చాలామంది నాలాగే ఏదో దూరంలోని ఊరి నుంచి వచ్చినవారే. వాళ్ళకూ తమదే అయినా 'హంపి ఎక్స్ప్రెస్' రైలు ఉండే ఉంటుంది. అందువల్ల ఈ కథలు వాళ్ళవి కూడా అవుతాయని నా నమ్మకం. అలాంటి బొడ్డుతాడు రైళ్ళన్నింటికీ ఈ సంకలనాన్ని ప్రేమతో అర్పిస్తున్నాను.