Guntur Jilla Communist Udhyamam (1935-1964)
Editor · Politics

Price: Rs. 90. తెలుగు గడ్డపై గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతం జాతీయోద్యమంలో, ప్రత్యేకంగా కమ్యూనిస్టు ఉద్యమంలో ముఖ్యపాత్ర నిర్వహించింది. 1930 దశకంలో ప్రారంభమై 50వ దశకానికి కమ్యూనిస్టు ఉద్యమం తెలుగు నేలపై బలమైన నిర్ణయాత్మక స్థాయికి చేరింది. శాసనోల్లంఘన ఉద్యమంలో కాంగ్రెస్ నాయకత్వ మెతకదనంతో విసిగిపోయిన యువకులు, కార్మికులు, కర్షకులు ప్రజాసమీకరణ వైపు దృష్టి పెట్టి జాతీయోద్యమాన్ని నిజమైన ప్రజాఉద్యమంగా మార్చారు. వీరంతా 1930వ దశకంలో అతివాద సోషలిస్టు భావ స్రవంతి వైపు మళ్ళారు. రైతు, కూలీ, కార్మిక, యువజన, విద్యార్థి, సాంస్కృతిక ఉద్యమాలను నిర్మించారు. వీటన్నింటికీ చోదకశక్తిగా కమ్యూనిస్టు పార్టీని బలపర్చారు. పర్యవసానంగా ఈ ప్రాంతంలో ప్రజాబలం ఏ స్థాయిలో పెరిగిందంటే 1952 ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంలోని మొత్తం 140 స్థానాల్లో కమ్యూనిస్టులు 40 స్థానాలలో కమ్యూనిస్టులు బలపరిచిన ప్రజా పార్టీ అభ్యర్థులు 13 స్థానాల్లో, వారి మద్దతుగల స్వతంత్ర అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో గెలుచుకున్నారు. 1955 ఎన్నికల్లో కమ్యూనిస్టులు 35 శాతం ఓట్లు సాధించారు. ఈ ప్రజాపునాది 70వ దశకంలో కొనసాగినా, దేశీయంగా వచ్చిన అనేక ఆటుపోట్లు, అంతర్జాతీయంగా సంభవించిన ఎదురుదెబ్బల ప్రభావాల మూలంగా ఈ ప్రాంతంలో కూడా కమ్యూనిస్టుల ప్రజాబలం క్రమేణా తగ్గింది. ఈ పరిణామం ఎంత నిరుత్సాహం కలిగించినా, ఇప్పటివరకు తెలుగు జాతి అభివృద్ధికి కమ్యూనిస్టు ఉద్యమం అందించినంత శాశ్వత ప్రయోజనాలను మరెవ్వరూ అందించలేదన్న విషయాన్ని మరువలేం. ఇప్పుడు తెలుగుజాతి సాధించిన విజయాలుగా మనం గర్వంగా చెప్పుకునే అనేక అంశాలు కమ్యూనిస్టు ఉద్యమం వేసిన పునాదులపై నిర్మించినవే. కృష్ణ, గుంటూరు జిల్లాల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గురించి సాంబిరెడ్డి రేఖామాత్రంగా రాసినప్పటికీ, ఈ పుస్తకాలు ఈ విషయాన్ని మనకు విదితంజేస్తాయి.