Grama Panchayathi Paalana
Editor · Politics

Price: Rs. 95. సుమారు పదహారు నెలల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తీర్పులో భారత రాజకీయాల దిక్సూచి లాంటి ఒక ఒరవడి కనిపించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా ఆ తీరు కనిపించింది. అదేమిటంటే 'సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలని ఓటర్లు స్పష్టమైన సంకేతాన్నివ్వటం'. అభివృద్ధిని సమ్మిళితం చేసి, అందులో భాగంగా స్థానిక ప్రభుత్వాలకు తగినన్ని నిధులు, అధికారాల్ని ఇవ్వవలసిన ప్రాధాన్యతను గత ఎన్నికలు తెలియ జేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలో వచ్చిన ప్రభుత్వం తొలినాళ్ళలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలోనే, మన దేశంలో స్థానిక ప్రభుత్వాల వ్యవస్థ రూపుదిద్దుకోవటానికి అమెరికా నుండి వచ్చి కృషి చేసిన ఎస్.కె.డే గురించి నాటి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత పంచాయితీల అభివృద్ధి కోసం వచ్చే నాలుగేళ్లలో రూ.25,000 కోట్లు ఖర్చు పెడతామని 2014-15 లో 'గ్రామజ్యోతి' పేరుతో పథకాన్ని ప్రకటించినా, తర్వాత ఆ పధకానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వబడలేదు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి - కలెక్టర్ (పీఎం - సీఎం - డీఎం) చుట్టూ తిరిగే పాలనను ఇంకా కేంద్రీకృతం చేయబడింది. గ్రామజ్యోతి వంటి కార్యక్రమాల్ని సక్రమంగా అమలు చేసి, సమ్మిళిత అభివృద్ధితో గ్రామీణ పట్టణ అంతరం తగ్గించితే తెలంగాణ సమగ్ర అభివృద్ధి మరింత వేగవంతం అవ్వడానికి అవకాశముంది.