Chikatilo Chirudeepam

Yaddanapudi Sulochana Rani · Novels

Chikatilo Chirudeepam book cover

Price: Rs. 140. సిటీకి దూరంగా! నిర్జన ప్రాంతం! ఎగుడు దిగుడుగా, గుట్టలు మెట్టలుగా వున్న మధ్య ప్రాంతంలో నుంచి ఒక కచ్చారోడ్డు సమతలంగా వున్న ప్రదేశం వైపు జారివచ్చినట్లుగా వుంది. ఊరిచివర కావటంవల్ల, అక్కడనుంచి 'నేషనల్ హైవే' దూరంగా వుండటంతో, ఎలాంటి జనసమర్థం కన్పించటంలేదు. ఆ ఆరుబయలులో, పరుగులుదీస్తున్న గాలి ఈలవేస్తూ వచ్చి, కచ్చా రోడ్డుమీద వున్న మట్టిని ఒక్కసారి తనతో లేపి, కిలకిలా నవ్వుతూ దూసుకు వెళ్ళిపోయింది. హుషారుగా వున్న ఆ గాలి పిలుపుకి వేయి కోర్కెలతో, కోటి ఆశలతో ఆనందంగా లేచిన మట్టి, ఆ వేగం అందుకోలేక తనలో ఆశలురేపి నిర్దయగా వెళ్ళిపోయిన గాలిని చూసి విస్తుపోయినట్లుగా, ఒంటరిగా, ఏం చెయ్యాలో తెలియనట్లుగా, ఆశాభంగంతో చెల్లాచెదురయి, మెల్లగా నేలమీదకి సోలిపోతున్నట్టుగా వాలిపోయింది. అక్కడున్న చెట్లు, పుట్టలు, రాళ్ళు రప్పలు నిశ్శబ్దంగా యీ దృశ్యాన్ని చూస్తున్నట్టు వుండిపోయినాయి. ఇంతలో ఎక్కడో సుదూరంగా రాళ్ళు 'ఫట్' 'ఫట్' 'ఫట్'మని పేలిన శబ్దం దిక్కులు పిక్కటిల్లేలా వినిపించింది. తనని డైనమేట్తో పేలుస్తుంటే, ప్రకృతి చేస్తున్న ఆర్తనాదంలా వుంది ఆ శబ్దం.

Browse more Telugu books