492 Telugu Jaatheeyaalu
Dr. Budaraju Radhakrishna / డా॥ బూదరాజు రాధాకృష్ణ · Books

Price: Rs. 195. తెలుగు జాతీయాలు అనే శీర్షిక కింద “ఈనాడు దినపత్రిక" ఆదివారం సంచికల్లో ధారావాహికంగా 1991 జనవరి 6 కూ 1992 డిసెంబరు 6కూ మధ్య కాలంలో వెలువడిన జాతీయాలను ప్రస్తుతం గ్రంథ రూపంలో ప్రచురిస్తున్నాను. ధారావాహికంగా రచించి ప్రచురించే అవకాశం నాకు కల్పించిన పత్రికాధిపతి రామోజీరావుగారికి నేనెంతో రుణపడి వున్నాను. ఇందులో 485 జాతీయాలకు అర్థ వివరణ లున్నాయి. మొదట ప్రచురిస్తున్నప్పుడు ఒకటి రెండు జాతీయాల వివరణ పునరుక్త మయింది. అకారాది క్రమంలో రాయటం కుదర లేదు. మిత్రులూ అభిమానులూ సూచించిన మేరకు అప్పటప్పటికి రాసి ముద్రణ కివ్వటంలో వచ్చిన ఈ లొసుగులను మాత్రం ఈ గ్రంథ ప్రచురణలో పరిహరించాను. అంతేగాని కొత్తగా ఏమీ చేర్చలేదు, మార్చలేదు. తెలుగులోని అనేక జాతీయాలు, కులాలనూ, వృత్తులనూ, స్థలాలనూ, ప్రవృత్తులనూ విమర్శించేవి, వెక్కిరించేవి, హేళన చేసేవి. ప్రస్తుత దేశకాల పరిస్థితుల్లో వాటిని వివరించటానికి సాహసం చాలలేదు. అప్పటప్పటి అనుభవాలను పురస్కరించుకొని ఆయాకాలాల్లో ఎవరో కల్పించిన జాతీయాలు కొంతకాలం జనామోదకరంగా ఉండి, కాలాంతరంలో మరుగుపడవచ్చు. వినోద దృష్టితో, సహన భావంతో వాటిని స్వీకరించలేని, ఆమోదించలేని, హర్షించలేని దేశకాలపరిస్థితులు వచ్చినప్పుడు వాటికి సహజ మరణం సంప్రాప్తిస్తుంది. కొంతకాలం తరవాత వాటికే పునర్జన్మ ప్రాప్తి కలిగినా ఆశ్చర్య పడనక్కరలేదు. సమాజ స్వభావంలోని విలక్షణతకు జాతీయాలు ప్రతిబింబాలు. వాటిని తెలిసి ప్రయోగించటం భాషాభిమానానికి నిదర్శన. ఇంతకు పూర్వం కీర్తిశేషులు నేదునూరి గంగాధరం వంటి మహనీయులు అష్టకష్టాలు పడి వీటిని సేకరించారు. ఈ రచనకు ఆధారభూతులైన అటువంటి సాహితీపరు లందరికీ నేను కృతజ్ఞుణ్ని. అర్ధవివరణ నాకున్న అనుభవజ్ఞానాదుల మీద ఆధారపడింది. అది సమగ్రమూ కాదు దోషరహితమూ కాదు. అందుకు పాఠకలోకం నన్ను మన్నించాలని కోరుతున్నాను. సాహితీ పరులకు ముఖ్యంగా విద్యార్థులకు- తెలిసినంతలో, చేతనైనంతలో, వీలయినంత స్పష్టంగా, చేతనయినంత సూటిగా ఆయా జాతీయాలను వివరించి భాషాభిమానం కలిగించాలని ప్రయత్నించాను. ఇందులోని దోషాలకు నేనే బాధ్యుణ్న