సుస్థిరోత్సవం / Susthirotsavam
Dr. T.Hima Bindu / డాక్టర్ టి. హిమ బిందు · Education & Science

Price: Rs. 75. ఈ సృష్టిలో మనం ఉన్నన్ని రోజులు పరిసరాలకు, సహజ వనరులకు హాని చేయకుండా ప్రకృతి ఒడిలో సేదదీరుతూ, జీవన గమనాన్ని సాగించాలి. మనిషి మనుగడ ప్రకృతిలోని ప్రతీ అంశంతో ముడిపడి ఉన్నదని గ్రహించి అది అందించిన, అందించబోయే సహకారానికి కృతజ్ఞతగా వుండాలి. పూర్వీకులు పండుగల ద్వారా ప్రకృతిని కొలుస్తూ దాని పరిరక్షణకై ఆయా వాతావరణ, ఖగోళ స్థాన చలనాల ఆధారంగా పండుగలు అనే పర్వ దినాలను ఏర్పాటుచేసి వారసత్వంగా అందజేశారు. ప్రకృతిని ఆరాధించటం, జీవరాశులన్నింటికి తగిన విలువనిచ్చి పూజించటం మన సంస్కృతిగా మారింది. ఆధునిక మానవుని జీవనసరళి కారణంగా, పూర్వీకులు ప్రకృతి పరిరక్షణ కోసం రూపొందిన పండుగలు రూపుమారి పర్యావరణానికే ముప్పు తీసుకు వస్తున్నాయి. కాబట్టి పండుగల అంతరార్థం తెలుసుకొని పర్యావరణానికి హాని కలిగించకుండా పండుగలను జరుపుకోవాలనే అవగాహన కల్పించడమే ఈ పుస్తక సారాంశం. -డా. టి.హిమబిందు ప్రభావాలు ఏవైనా కావచ్చు గానీ ఇటీవలి కాలంలో 'పండుగ చేస్కో' అనే మాట వ్యవహర్తల మధ్యకు వచ్చేసింది. పండుగలు చేసుకోండి గాని, కొంచెం బాధ్యతాయుతంగా జరుపుకోండి అని సూచిస్తున్నారు హిమబిందు. ముఖ్యంగా -పర్యావరణం పట్ల మనకుండవలసిన స్పృహ, చైతన్యాల గురించి మాట్లాడారు. ముందుచూపు, దూరదృష్టి ఎంత అవసరమో తెలియజేస్తున్నారు. జీవితం ఒక ఉత్సవం, ఒక వేడుకగా సాగి మానవులుగా ఈ భూమండలం మీద మిగతా జీవరాశులకు మనతో పాటు మనుగడ సాగించే హక్కుందని గుర్తించినప్పుడే సుస్థిరోత్సవాలు కలకాలం కనుల పండుగగా జరుపుకోగలుగుతామని భావిస్తున్నారు. పర్యావరణం, సాంస్కృతిక జీవనం వైరుధ్యాంశాలు కానని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ రచన మనకు గుర్తు చేస్తున్నది. సింధువంత విషయాన్ని బిందు రూపంలో వెల్లడించిన హిమబిందు ఆలోచనల వెనుక ఉన్న ఆవేదనను ఆలకించడం, ఆచరించటమే ఈ రచనకు మనమివ్వాల్సిన గౌరవం. -సీతారాం