శ్రీమతి / SREEMATHI
దొండపాటి కృష్ణ / Dondapati Krishna · Books

Price: Rs. 144. 'శ్రీమతి' - దొండపాటి కృష్ణ రెండవ కథాసంపుటి. కృష్ణ కొత్త తరానికి చెందిన కథకుడు, దొండపాటి కృష్ణలో నాకు నచ్చిన అంశం ఒకటుంది. కొన్ని కథలను స్వయంగా ఈ సంపుటినుంచి పక్కన పెట్టాడు. తను రాసిన కథలన్నీ ప్రచురించా అనుకోలేదు. రచయితకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఆత్మ పరిశీలన. అలాగే ఇందులో కథలను పరిశీలించినప్పుడు ఓ విషయం అర్థం అయ్యింది. ఏ తరహా కథలు రాస్తే అచ్చవుతాయో అలాంటి వాటి చుట్టూ అతను తిరగలేదు. భిన్నమైన ఇతివృత్తాలను స్వీకరించాడు. తన అనుభవంలోకి, పరిశీ లనకు వచ్చిన అంశాలను ఎన్నుకున్నాడు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో, భార్య భర్తల సంబంధాల్లో వస్తున్న రకరకాల పరిణామాలను ఈ కథల్లో చిత్రించే ప్రయత్నం చేశాడు. స్త్రీ నేపథ్యం ఉన్న కథలు కాబట్టి ఈ కథల నిండా ఫెమినిస్ట్ ధోరణి ఉంటుందని అనుకోనవసరం లేదు. ఇందులో స్త్రీ హృదయం ఉంది. అత్యంత కఠినమైన సందర్భాల్లో ఇందులోని స్త్రీ పాత్రలు బలహీనులుగా మిగిలిపోరు. జీవితాన్ని ఎదుర్కొంటారు. తమకు పరిచయం లేని, అనుభవం లేని రంగాల్లోకి వెళ్లి అక్కడ విజయాన్ని సాధిస్తారు. 'ప్రకృతి సేద్యం', 'భూమిపుత్రి' వ్యవసాయ రంగం మీద రాసిన కథలు.. 'యాక్సిడెంట్' సంస్కరణ కథ.. 'లక్ష్మి నిర్ణయం', 'స్పందించిన మనస్సు', 'దేవు డెక్కడో లేడు', 'చెదిరిన సిగ్గు' ఇలా చెప్పుకుంటూ పోతే స్థలం చాలదు. ఈ కథలు చదవండి. ముఖ్యంగా స్త్రీలూ, పురుషులూ, కుటుంబాలు తమ జీవితాలతో పోల్చుకోండి. అలాగే రచయితకు మీ భావాలు చెప్పండి. తద్వారా అతను మరింతగా జీవితంలోకి చొచ్చుకుపోవటానికి అవకాశం ఉంది. దొండపాటి కృష్ణకు నా అభినందనలు. వచ్చే కథల సంపుటిలో తాను మరిన్ని కొత్త సమస్యల మీద దృష్టి సారించగలడనే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు.