వాసు చరిత్ర / Vasu Charitra
Dr. Pedapati Nageswararao / డా.పెడపాటి నాగేశ్వరరావు. · Literature

Price: Rs. 45. మహామహోపాధ్యాయ డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు గారి రచనలు వేద ప్రామాణికంగా ఉంటాయి. కల్పనా సాహిత్యం కంటే, విజ్ఞానదాయకమైన, తర్కబద్ధమైన రచనలకే వారు అధిక ప్రాధాన్యమిస్తారు. గతంలోని వారి రచనలన్నీ ఇటువంటి విలువలను చాటి చెప్పినవే. ఆ దిశలోనే జరిపిన కృషి ఫలితమే ఇప్పుడు వారి ఈ 'తెలుగు, మరాఠీ సాహిత్యాలలో వసుచరిత్ర' అన్న మరో గ్రంథరాజం. భారతీయ సాహిత్యంలో రామాయణ, భారత, భాగవతాలు శిఖరాయమానాలు. ఆ శిఖరాగ్రం నుండి జాలువారే సెలయేళ్ళు నేలపై సరస్సులై, తటాకాలై, నదులై, ఉపనదులై ఈ భూమిని ఏ విధంగా సారవంతం చేస్తాయో, అట్లాగే పై రచనల నుంచి అనేక రచనలు భారతీయ సాహిత్యాలన్నింటిలో పురాణ, కావ్య, ప్రబంధాలై పరిఢవిల్లి సాహిత్య కోశాగారాన్ని సుసంపన్నం చేశాయి. వేదవాక్యాలు రామాయణ, భారతేతి హాసాలుగా రూపొందితే, వీటిల్లోని కథలు, ఉపకథలు ఆయా కవుల ఊహాశాలీనతను, కల్పనా చాతుర్యాన్ని బట్టి స్వతంత్ర కావ్య ప్రబంధాలుగా కోకొల్లలుగా వెలువడ్డాయి. అటువంటి వాటిల్లో తెలుగు సాహిత్యంలో ప్రబంధయుగంలో వెలువడిన 'వసుచరిత్ర' ఒకటి. దీనిలో అష్టవసువులలోని ఒక వసువు యొక్క ఉదంతం కథగా మలచబడింది. అసలు ఈ అష్టవస్తువులు ఎవరు ? అని పరిశీలిస్తే, వేదాలలో వీరి ప్రస్తావన కనిపిస్తుంది. జీవులందరు ఈ లోకం నుంచి నిష్క్రమించగానే పితృలోకాలకు వెళతారనీ, వారి వారి కర్మలను బట్టి వసు, రుద్ర, ఆదిత్య రూపాలతో ఆ పరమాత్ముని సాయుజ్యాన్ని పొందుతారనీ వివరించబడింది. వీరు ఈ ప్రపంచంలో పితృ, పితామాహ, ప్రపితామహ స్థానీయులుగా, పరమ పూజనీయులుగా ఉగ్గడించబడింది.