భరతదేశ చరిత్ర / Bharathadesa Charitra
K. L. Kantharao / కె.ఎల్.కాంతారావు · History

Price: Rs. 65. "అనాదికాలం నుండి, చారిత్రక అంశాలపై ఆధిపత్యమూ, వాటి వివరణలను తమకు అనుకూలంగా మార్చుకోవడమూ అనేవి ప్రజల ఆలోచనలపై ఆధిపత్యానికి అత్యంత ఆవశ్యకము అన్న విషయాన్ని పాలకవర్గాలు గుర్తించాయి” అని “ప్రపంచ చరిత్ర" అన్న గ్రంధంలోని మొదటి పేజీలలోనే “హోవర్డ్ స్పోడెక్" అనే రచయిత పేర్కొంటాడు. దానికి రుజువుగా క్రీ.పూ. 201-168 మధ్య చైనాలో జీవించిన కవి, రాజనీతివేత్త అయిన జియా-ఇ అనే రచయిత పేర్కొన్న అంశాన్ని ఉటంకిస్తాడు. జియా-ఇ ఏం వ్రాశాడంటే "చైనా ప్రథమ చక్రవర్తి యైన క్విన్ షి హువాంగ్ గతంలో సాధించబడిన విజ్ఞానాన్నంతా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. అతడు ప్రజలను గతానికి సంబంధించిన విజ్ఞానానికి దూరం చేసే ప్రయత్నంలో భాగంగా పూర్వకాలంలోని రాజర్షుల పద్ధతులన్నింటినీ రద్దు చేశాడు. 'వంద పాఠశాలలు' అనే ప్రాచీన విజ్ఞానానికి సంబంధించిన రాత ప్రతులన్నింటినీ అగ్నికి ఆహుతి చేశాడు. పెద్ద నగరాల గోడలను కూలగొట్టాడు. సమర్థులు, కీర్తిమంతులైన వారిని చంపించాడు. అలా గతాన్ని నిర్మూలించాననుకొన్నాడు." అని వ్రాశాడు.