బానిసలు - భగవానువాచ/ BANISALU - BHAGAVANUVACHA
డా|| కేశవరెడ్డి /Dr. Keshava Reddy · Novels

Price: Rs. 117. 'మాలపల్లినీ అగ్రహారాన్నీ కలుపుతూ ఒక రోడ్డువేస్తే ఎంత బావుండును' అన్నాడు సుబ్బారాయుడు. అతడలా అనగానే పొగడచెట్టు మీదనున్న కాకి ఎర్రని నోరు తెరచి కాకా అని అరచింది. 'అదుగో పోస్టుమాస్టరుగారు వస్తున్నారు' అన్నాడు తపాలాఫీసు ముందు పొగడ చెట్టు నీడన కూర్చుని ఉన్న కరణం. వీధి చివరన పోస్టుమాస్టరు వారు గొడుగువేసుకుని వస్తూ ఉండడం కనిపించగానే అతనికి సంతోషమయింది. పొగడచెట్టు నీడన ఉన్న అరుగుమీద కూర్చుని అతడు పోస్టుమాస్టరుగారి కోసం అరగంట నుండి ఎదురు చూస్తున్నాడు. పట్నంలో కాలేజి చదువు వెలిగిస్తున్న కుమారుడి నుండి ఈ రోజు ఉత్తరం వస్తుందని అతడు ఆశలు పెట్టుకుని ఉన్నాడు. పోస్టుమాస్టరుగారు పరుగే నడకగా వచ్చి తపాలాఫీసు ముందాగాడు. గుమ్మం వద్ద చెప్పులు విడిచి గొడుగును ముడిచాడు.