పళ్ళు రాలిన పులి / PALLU RALINA PULI
Dr. M. Hari Kishan / డా.ఎం.హరి కిషన్ · Novels

Price: Rs. 75. ఒక అడవిలో ఒక దొంగతోడేలు వుండేది. ఒకరోజు దానికి అడవి అంతా వెతికినా ఆహారం దొరకలేదు. కడుపు నకనకలాడసాగింది. పోతా పోతావుంటే దానికి ఒక చెట్టు కొమ్మమీద కోడి కనిపించింది. ఎలాగైనా మోసంచేసి దానిని తినాలి అనుకుంది. “ఓ కోడీ! నీకు ఒక మంచిమాట చెబుతాను. అడవిలో జంతువులంతా ఇకపై కలసిమెలసి బంధువుల మాదిరి ఉండాలి. ఎవరూ ఎవరినీ చంపకూడదు అని నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఇప్పటినుంచీ మనమంతా ఒకటే. కిందికి దిగిరా. ఆడుకుందాం” అని పిలిచింది. కోడికి తోడేలు చేసే మోసాలు బాగా తెలుసు. వెంటనే కొమ్మమీద నిటారుగా నిలబడి దూరంగా చూడసాగింది. "ఏం కోడిమామా... ఏమలా నిటారుగా నిలబడి చూస్తున్నావు” అని అడిగింది తోడేలు. "ఏం లేదు తోడేలుబావా! దూరంగా ఒక పులులగుంపు ఇటువైపే వేగంగా దుమ్ములేపుకుంటు వస్తూ ఉంది. ఎన్ని ఉన్నాయా అని లెక్కబెడుతున్నా” అంది కోడి. దాంతో తోడేలు పైప్రాణాలు పైన్నే పోయాయి. "అయ్యబాబోయ్! పులుల గుంపా! అవిగానీ వచ్చాయంటే నా శరీరంలో ఒక్క ఎముక కూడా మిగలనియ్యవు నేవస్తా!” అని తోక ముడుచుకొని పారిపోబోయింది. "అదేంటి తోడేలుబావా! జంతువులంతా కలసిమెలసి ఆడుకోవాలని నిర్ణయం తీసుకున్నాయని ఇప్పుడే చెప్పావు కదా! ఎందుకు భయం. అవి వస్తే హాయిగా ఆడుకోవచ్చుగదా" అంది కోడి పకపక నవ్వుతూ. కోడిపిల్ల దగ్గర తన పప్పులు ఉడకవని తెలుసుకొని చల్లగా జారుకుంది తోడేలు.