తలపుల తోవా / TALAPULA TOVA
Shaukat Kaifi / షౌకత్ కైఫీ · Biographies & Auto Biographies

Price: Rs. 95. కైఫీ అజ్మీ - ఉర్దూ కవితాలోకంలో అజరామరమైన ఆర్ద్ర గంభీర ఉద్రిక్త ఆలోచనా స్వరం. ఉత్తరప్రదేశ్ జమీందారీ కుటుంబంలో పుట్టి, ఇల్లు వదిలి వచ్చి, బొంబాయిలో కార్మికులను సంఘటితం చేసే కమ్యూనిస్టు కార్యకర్తగా మారి, ఇరవయో ఏటికే సుప్రసిద్ధ కవిగా లోకాన్ని ఉర్రూతలూగించి, అభ్యుదయ కవుల ముషాయిరా కోసం హైదరాబాద్ వచ్చి షౌకత్ తో ప్రేమలో పడ్డాడు. షౌకత్ ఖానమ్ - నిజాం ప్రభుత్వంలో ఉన్నతోద్యోగి కూతురు. తొలియవ్వనంలోనే కవిత్వాభిమాని అయి, అక్కతో పాటు ముషాయిరాకు వెళ్లి కైఫీతో ప్రేమలో పడింది. కమ్యూనిస్టు పార్టీ పూర్తికాలం కార్యకర్తగా కైఫీ ప్రేమ మీద ఆంక్షలేమీ లేవు. కాని షౌకత్ ప్రేమకు తండ్రి తప్ప మిగిలిన కుటుంబమంతా వ్యతిరేకమే. కూతురి ప్రేమను గౌరవించిన తండ్రి ఇంట్లో చెప్పకుండా షౌకత్ ను బొంబాయికి తీసుకువెళ్లి షౌకత్ కైఫీ ల పెళ్లి చేసి వచ్చాడు. అది 1948. అప్పటినుంచి కైఫీ మరణించిన 2002 దాకా అర్ధశతాబ్ది పైగా సాగిన ఆ అన్యోన్య సహజీవన జ్ఞాపకాలను అద్భుతంగా కళ్లకు కట్టిన తలపుల తోవ - యాద్ కీ రహుజర్ - ఇది. ఆ ఐదు దశాబ్దాలలో కైఫీ హిందీ సినిమాల పాటలతో, సంభాషణలతో మరింత ప్రముఖు డయ్యాడు. షౌకత్ పృథ్వీరాజ్ కపూర్ తో, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం లోని ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇష్టా) తో, స్వతంత్ర ప్రయోక్తలతో నాటక రంగంతో ప్రారంభించి సినిమా రంగంలో కూడ ప్రవేశించి ఉజ్వలమైన అభినయంతోనూ, నటి షబానా ఆజ్మీ, ఛాయా చిత్రగ్రాహకుడు బాబా ఆజ్మీలను కన్నతల్లిగానూ భారత సినిమా రంగానికి అపారమైన సేవలు చేసింది. అర్థశతాబ్ది సామాజిక చరిత్ర శకలాలెన్నిటినో వ్యక్తిగత, కుటుంబ, సామూహిక అనుభవాలనుంచి వ్యక్తీకరించిన అపురూప జ్ఞాపకాల, పరిమళభరిత పుష్పాల గుచ్ఛం ఇది.