ఘర్షణ / GHARSHANA
DR. KONDAPALLI NEEHARINI / డాక్టర్. కొండపల్లి నీహరిణి · Stories & Poetry

Price: Rs. 135. కొండపల్లి నీహారిణి ప్రతి కథలో స్త్రీల మనోవేదన అంతర్లీనంగా ప్రవహిస్తుంది. పెండ్లిలు, సంప్రదాయాలు, దాంపత్య ఘర్షణలు, మెన్స్టాల్ సమస్యలు, ఒంటరితనాలు, ఉద్యోగజీవితాలు, దేశాంతర అనుభవాలు, సాంకేతిక విధ్వంసాలు ఎన్నెన్నో పాఠకుల్ని కలవర పరుస్తాయి. తేటపరుస్తాయి. నీహారిణిది నిశితమైన చూపు. కొన్ని సార్లు సంప్రదాయాల పట్ల అభిమానం ప్రకటిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో సంప్రదాయాన్ని నిరాకరించి ఆధునిక భావాల్ని అక్కున చేర్చుకుంటుంది. సంప్రదాయ భావనలోని చాదస్తాన్ని, ఆధునిక చైతన్యంలోని విపరీతాన్ని మెత్తమెత్తగా ఒకోసారి కొంచెం గట్టిగానే మందలించే పద్ధతి నీహారిణి ప్రత్యేకత. ఇందులోని పందొమ్మిది కథల్లో పది, పదకొండు కథలు స్త్రీల కోణం నుంచి స్త్రీ జీవితాన్ని చిత్రించినవే. - నందిని సిధారెడ్డి నీహారిణి కథలన్నీ కూడా సంభాషణలో కన్నా నెరేషన్లో చెప్పటం వలన అదే రచయిత్రి రచనా పద్ధతిగా అనిపించింది. అందువలన కథల్లో రచయిత్రి కథలోనికి వచ్చి రచయిత్రి అభిప్రాయాలు, రచయిత్రి మనోభావాలు కథలలో పాఠకులకు స్పష్టీకరించటం గమనించవచ్చు. ముఖ్యంగా ముగింపులో రచయిత్రి అభిప్రాయ ప్రకటన స్పష్టంగా ఉంటుంది. కథలన్నీ ఎక్కువగా గ్రామీణ నేపథ్యంలో ఉండటాన రైతు జీవన విధానాలు, వృత్తి విద్యలతో జీవనం గడిపే శ్రామికులు, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయటం, ఆడపిల్లల చదువుల పట్ల అలక్ష్యం, ఆధునిక అలవాట్లు, స్మార్ట్ ఫోన్లు యువతను పెడదార్లు పట్టించటం మొదలైన అంశాలన్నీ నీహారిణి కథల్లో అనేక రూపాల్లో దర్శిస్తాం. - శీలా సుభద్రాదేవి