గేయములు-పాటలు / GEYAMULU - PAATALU
అగ్రహారం సత్యనారాయణ / Agraharam Satyanarayana · Stories & Poetry

Price: Rs. 45. ఈ పుస్తకంలోని పాటలు వెలుగులోకి తీసుకురావడానికి ముఖ్య కారణములు రెండు. మొదటి కారణం మా తల్లిగారైన శ్రీమతి అగ్రహారం బిక్కి నాగమ్మ, ఇ.ఎస్.ఎల్.సి చదివిన మా అమ్మ అనంతపురము సర్వీసు హోమ్ నందు సేవికగా పనిచేస్తూ విశ్రాంతి నొంది, 1997లో పరమపదించారు. ఆమె, మా చిన్నప్పుడు చేసే నిత్యపూజల్లో దైవభక్తి గీతాలు ఆలపించేవారు, వాటిని మేము కూడా గొంతు కలిపి పాడేవాళ్ళం. ఆమె స్వంతంగా పాటలు రాసి తనే బాణీ కట్టి పాడేవారు. నేను పాటలు రాయడానికి బాణీ కట్టి పాడడానికి ఆమె నాకు స్ఫూర్తి. నా తమ్ముడు ఎ. సుధాకర్ కూడా పాటలు శ్రావ్యంగా పాడేవారు, మేమిద్దరం కలిసి పాటలు పాడుకొనేవారం. అదొక దైనందిన కార్యక్రమముగా మారిపోయింది. మా అమ్మ ప్రోత్సాహమే... నా ఈ రచనకు ప్రేరణ. ఇక రెండవ కారణం నేను చదివిన కంబదూరు మండలము తిమ్మాపురం గ్రామ సేవా మందిరము జయం ఆదెప్ప సేవామందిరం ఉన్నత పాఠశాల వాతావరణం. మా పాఠశాలలో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు అనేకం జరిగేవి, మా పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ హనుమంతయ్య గారు పాటలు పాడేవారు, మాచేత పాడించేవారు. వారు స్వయంగా దేశభక్తిగీతాలు రాసి బాణీ కట్టి పాడేవారు, మాకు నేర్పించేవారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఎప్పటికైనా వారిలాగా దేశభక్తిగీతాలు రాయాలి, రాసి బాణీకట్టి పాడాలనే కోరిక ఎక్కువగా వుండేది, వారనే కాదు మా సేవామందిర పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు సాహిత్య గోష్టులలో విరివిగా పాల్గొనేవారం.