కొడవటిగంటి కుటుంబరావు కథలు / KODAVATIGANTI KUTUMBARAO KATHALU
కేతు విశ్వనాథరెడ్డి / KETHU VISHWANATHA REDDY · Books

Price: Rs. 225. ఈ సంకలనంలో కీర్తి కండూతి అనే ఒక కథ వుంది. ఈ కథలో ఆంధ్రుల రాజకీయ సాంస్కృతిక జీవితంలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని-1955 ఘట్టాన్ని కుటుంబరావు చిత్రించారు. ఆయన ఈ కథలో సాహిత్య హనుమంతులనూ, జాంబవంతులనూ చిత్రించారు. ఏ సిద్ధాంతాన్నీ ఆచరించకుండానే ఏ లోతూ లేకుండానే వీళ్ళు చేసే సాహిత్య దూషణలనూ, వ్యాసాల రూపంలో రాసే బండబూతులనూ ఎత్తిచూపారు. "తెలుగు వాజ్మయానికి చిరకాలంగా తీరని సేవ చేస్తున్న మోతుబరులు" అచ్చు వేసి తమ సంస్కృతిని బయటపెట్టుకున్న ఉదంతాన్ని ఈ కథలో ఆయన ప్రస్తావించారు. అణచిపెట్టిన కీర్తి దాహమూ, కీర్తి కండూతీ ఉండే హనుమంతుడిలాంటి రచయితలు సదరుగా కనిపించే రచయితలకు, రాజకీయ నాయకులు సాటి రాజకీయ నాయకులకు తారు పూసినట్లు ఎట్లా పూస్తారో ఎత్తిచూపారు. ఇటువంటి సాహిత్య కుసంస్కారాన్ని పాఠకులు అసహ్యించుకునేట్లు, అసహ్యించుకునే అవసరం ఉన్నట్లు ఈ కథ ద్వారా తెలిపారు. "కీర్తి కండూతి” కథలోని ప్రధాన పాత్ర హనుమంతుడు. బళ్ళో ఉన్నప్పుడు సాటి పిల్లలు ఏడిపించని శక్తుల్ని సంపాదించాలనుకున్నాడు. మితభాషిత్వం నేర్చుకున్నాడు. తనలో ఇంతకాలమూ లోపించిన శక్తులు ఇన్నాళ్ళకు మొలకెత్తాయని భ్రమపడ్డాడు. తన అభిప్రాయాలు పైకి చెప్పసాగాడు. అందరూ నవ్వసాగారు. వాడికి మేధావులు చెప్పే విషయాలు క్షుద్రంగా కనపడసాగాయి. తన మేధావిత్వాన్ని చూసి హర్షించే ఉప మేధావులు దొరికేదాకా తాను నోరు విప్పకూడదనుకున్నాడు. హనుమంతుడికి చదువు పూర్తి చేసిన రోజుల్లో వాళ్ళ ఊళ్ళో ఒక భజన పార్టీ ఏర్పడ్డట్టు తెలుసుకున్నాడు. దాని నాయకుడు జాంబవంతుడు. జాంబవంతుణ్ణి చూసిన నిమిషంలోపల హనుమంతుడికి గురి కుదిరిపోయింది. జాంబవంతుడు ఇతరుల్ని అపహాస్యం చేయగలడు, ఇంకొకణ్ణి ఉబ్బేయగలడు. హనుమంతుడు తనకు ఒక నాటకాన్నీ, నవలనూ రాయాలని ఉందని చెప్పాడు. 'భేష్! నాటకం ముగించు' అని అన్నాడు.