ఆముక్తమాల్యదలు / Amuktamalyadalu
Dr. Pedapati Nageswararao / డా.పెడపాటి నాగేశ్వరరావు. · Literature

Price: Rs. 45. ఆముక్తమాల్యదయన్న గ్రంధము తెలుగు సాహిత్యమున ప్రసిద్ధి చెందిన ప్రబంధము. దీనికి వ్యాఖ్యలు, విమర్శలు పెక్కు వెలసినవి. ఇది కావ్యమే అయినను దీనికి మతము, ప్రాంతీయత, రాజకీయము మొదలగు పార్శ్వములు చోటుచేసుకొని యున్నవి. వీటన్నిటికి మించి ఉన్న తమిళ పార్శ్వము వ్యాఖ్యలలో విమర్శితము కాలేదు. అందువలన ఈ గ్రంథమున దానిని స్పృశించుట జరిగినది. ఆంధ్రప్రభదినపత్రిక ఆదివారము సాహిత్యానుబంధములోను, స్రవంతి సాహిత్య మాస పత్రికలోను ఇందలి కొన్ని భాగములు ప్రచురితములై పండిత ప్రశంసలందినవి. వానిలో మొదటిది కళాప్రపూర్ణ డా॥నిడదవోలు వెంకటరావు గారిది. వారి శుభాశీస్సులతో గల సందేశం ముందు ముద్రించుచు స్వర్గము నుండి వీక్షించుచున్న శ్రీవారి ఆత్మకు అంజలి ఘటించుచున్నాను. ఆంధ్రసాహిత్య వ్యాఖ్యానమున విమర్శనమొక విశిష్ట శాఖ. అందు గుణదోషములు రెండును స్పృశింపవలసిన అవసరమున్నది. కాని ముక్కాలు మువ్వీసము సాహిత్య విమర్శలు అభిమానమును మాత్రమే కురిపించుచు ముగియుట కద్దు. ఈ చిన్న గ్రంథములో సాహిత్యమునకే ప్రాధాన్యమీయబడి తక్కిన పార్శ్వములను అప్రధానములు చేయబడిన సంగతి గమనింప నివేదన. ఆశీస్సులు ఆదరణలు అందించిన మహనీయులకందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియబరచుకొనుచున్నాను.