ఆదివాసులు /Aadivasulu
కె .బాలగోపాల్ /K.Balagopal · Caste, Religion & Culture

Price: Rs. 145. గొత్తికోయలయినా కోయలయినా ఆదివాసులలో మిలిటెన్సీ ఎక్కువ. దానిని ఇరుపక్షాల నాయకులూ నిర్మొహమాటంగా వాడుకుంటున్నారు. తమ ప్రత్యర్థులుగా భావించిన వారిపైన మూకుమ్మడిగా దాడి చేయడానికి, గొర్రెలను నరికినట్టు నరకడానికి ఆదివాసులు వెనకాడరు. ఈ గుణాన్ని అటు సల్వాజుడుం నాయకులు, ఇటు మావోయిస్టు నాయకులు కూడ ప్రోత్సహిస్తున్నారు, వాడుకుంటున్నారు. 'వాళ్లు చేస్తున్నారు కాబట్టి మేము చేయక తప్పదు' అని ఇద్దరూ అనొచ్చు. ఏమయితేనేం ఇది జరుగుతున్న మాట సత్యం. దీని ఫలితం ఆదివాసీ హననం. ఒక సంవత్సర కాలంలోనే ఒక్క దంతెవాడ జిల్లాలోనే ఈ హత్యాకాండలో 500 ప్రాణాల దాకా పోయాయి. అందులో 95 శాతం మంది స్థానిక ఆదివాసులే. విప్లవ సానుభూతిపరులు కావచ్చు, విప్లవ వ్యతిరేకులు కావచ్చు, సాదా కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ అనుయాయులు కావచ్చు, అత్యధిక భాగం ఇవేవీ కాని అడవి బిడ్డలు కావచ్చు. మొత్తానికి అంతా ఆదివాసులే.